10/11/2026, Tuesday · 12:49:28 AM About UsPrivacy PolicyContact Us
Global Vaartha

సెనెగల్ తీరంలో ఘోర పడవ ప్రమాదం.. 21 మంది మృతి

భవ్య జర్నలిస్ట్ 09/11/2026 10:35 AM అంతర్జాతీయం 1

సెనెగల్ తీరంలో ఘోర పడవ ప్రమాదం.. 21 మంది మృతి
Want this news as a newspaper clip?Print News Clip

డకార్ : పశ్చిమ ఆఫ్రికా దేశమైన సెనెగల్ తీరంలో ఘోర పడవ ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం వలసదారులతో ప్రయాణిస్తున్న పడవ.. అట్లాంటిక్ మహాసముద్రంలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 21 మంది మృతిచెందగా.. ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడినట్లు సెనెగల్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదివారం వెల్లడించింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. సెనెగల్ రాజధాని డకార్‌కు ఉత్తరాన 180 కిలోమీటర్ల దూరంలోని కెబెమెర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది.శనివారం నాడు సముద్రంలో పడవ మునిగిపోయిందన్న సమాచారంతో సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. ఇప్పటివరకు 21 మృతదేహాలను వెలికితీయగా.. ఒకరిని సజీవంగా రక్షించారు. సముద్రంలో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ప్రమాద సమయంలో పడవలో ఎంతమంది ప్రయాణిస్తున్నారనే విషయాన్ని అధికారులు వెల్లడించలేదు. దీంతో ఇంకా ఎంతమంది గల్లంతయ్యారనే దానిపై స్పష్టత లేదు. మరోవైపు, ఈ ప్రమాదంపై సెనెగల్ ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపింది. అక్రమ వలసలకు పాల్పడే వ్యక్తుల నెట్‌వర్క్‌లను అరికట్టేందుకు పొరుగు దేశాలతో కలిసి పనిచేస్తామని స్పష్టం చేసింది.

కాగా, పశ్చిమ ఆఫ్రికా నుంచి స్పెయిన్‌లోని కానరీ దీవులకు అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా వెళ్లే మార్గం ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వలస మార్గాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. మెరుగైన జీవనోపాధి, ఉపాధి అవకాశాల కోసం అనేక మంది ఈ మార్గంలో ఐరోపాకు చేరుకోవాలని ప్రయత్నిస్తున్నారు. అయితే సరైన భద్రత లేని చిన్న పడవల్లో సముద్ర ప్రయాణం చేయడం ప్రాణాలకే ముప్పుగా మారుతోంది. స్పెయిన్‌కు చెందిన వలసదారుల హక్కుల సంస్థ వాకింగ్ బోర్డర్స్ గణాంకాల ప్రకారం.. 2026 తొలి ఐదు నెలల్లోనే ఈ అట్లాంటిక్ మార్గంలో కనీసం 635 మంది ప్రాణాలు కోల్పోయారు. కానరీ దీవులకు వెళ్తున్న ప్రతి 100 మందిలో సుమారు 21 మంది సముద్ర ప్రయాణంలో మరణిస్తున్నట్లు ఆ సంస్థ వెల్లడించింది.

ఇదీ చదవండి :: సీబీఎస్ఈ 10, 12 ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

Senegal coastdeadboatcapsizesoff

About the author

భవ్య జర్నలిస్ట్

భవ్య జర్నలిస్ట్

Editor

ANDHRA PRADESH

Digital News Creator with 7 years of experience in journalism, content writing, political reporting, SEO, and social media management.

993 Posts

Latest News