ఈజీ క్యాచ్‌ను వదిలేసిన పాకిస్థాన్ ప్లేయర్లు.. వీడియో వైరల్!

స్పోర్ట్స్ డెస్క్: క్రికెట్ ప్రపంచంలో పాకిస్థాన్ పేరు చెప్పగానే వారి బౌలింగ్ గుర్తుస్తోంది. పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను భయపెడుతూ ఎన్నో అద్భుత విజయాలను పాక్ సొంతం చేసుకుంది. ఇదిఇలా ఉంటే.. బౌలింగ్‌తో పాటు పాక్ ప్లేయర్ల కామెడీ ఫీల్డింగ్ కూడా గుర్తుకొస్తుంది. అంతర్జాతీయ క్రికెట్లో తరచూ ఏదో ఒక సందర్భంలో తమ చెత్త ఫీల్డింగ్‌తో పాకిస్థాన్ ప్లేయర్లు నవ్వులపాలవుతుంటారు. ఆ విషయం తాజాగా అండర్-19 స్థాయిలో కూడా భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో నిరూపితమైంది. ముగ్గురు ఫీల్డర్లు ఒకే బంతి వద్దకు వచ్చి పరస్పరం ముఖాలు చూసుకుంటూ సులువైన క్యాచ్‌ను వదిలేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.ఏసీసీ అండర్-19 ఆసియా కప్ 2026లో టీమిండియా, పాకిస్థాన్ మధ్య మ్యాచ్ జరిగింది. భారత్ ఇన్నింగ్స్ 45వ ఓవర్లో విచిత్ర సంఘటన చోటుచేసుకుంది. పాక్ బౌలర్ మహమ్మద్ సయ్యం వేసిన బంతిని టీమిండియా బ్యాటర్ కావ్య పటేల్ భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే బంతి బ్యాట్ టాప్ ఎడ్జ్ తీసుకుని గాల్లోకి లేచింది. ఈ క్యాచ్‌ను అందుకోవడానికి బౌలర్ మహమ్మద్ సయ్యం, వికెట్ కీపర్ హమ్జా జహూర్, మరో ఫీల్డర్ ఉస్మాన్ ఖాన్ కూడా ఒకేసారి బంతి కోసం వచ్చారు. ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ముగ్గురిలో ఏ ఒక్కరూ క్యాచ్ పట్టే ప్రయత్నం చేయలేదు. దాంతో బంతి ముగ్గురి మధ్యలో నేలపై పడింది. ఈ ఊహించని పరిణామంతో కోపంతో ఊగిపోయిన బౌలక్ సయ్యం తోటి ఆటగాళ్లపై అరుస్తూ కనిపించాడు.
ఈ ఘటనతో కామెంటేటర్లు కూడా నవ్వులు ఆపుకోలేకపోయారు. సోషల్ మీడియోలో వైరల్ అవుతోన్న ఈ ఘటనపై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 'వారికి తెలిసిన నైపుణ్యాన్ని వారు ప్రదర్శిస్తున్నారు. అందులో తప్పేముంది' అంటూ కొందరు పాక్‌పై సెటైరికల్‌గా కామెంట్స్ చేస్తున్నారు. 'పాకిస్తాన్ క్రికెటర్లు తమ బ్రాండ్ కామెడీ ఫీల్డింగ్‌ను ఎప్పటికీ మర్చిపోరు' అంటూ మరికొందరు ట్రోల్ చేస్తున్నారు. ఈ క్యాచ్ డ్రాప్ చూడగానే గతంలో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో షోయబ్ మాలిక్, సయీద్ అజ్మల్ ఓ క్యాచ్ విషయంలో ఇలాగే ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ క్యాచ్ వదిలేసిన పాత జ్ఞాపకాలు క్రికెట్ అభిమానులు గుర్తు చేసుకున్నారు.
ఇదీ చదవండి :: సీబీఎస్ఈ 10, 12 ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల












